Friday 8 August 2014

క్షేత్ర దర్శనం ఎందుకంటే ...?

ఇటీవల శ్రీశైలం క్షేత్రానికి వెళ్ళాం. శ్రీశైల క్షేత్రం ఋషుల తపోభూమి. అక్కడ శివుడు ఎలా వెలిశాడు అనే ప్రశ్న వచ్చింది. ఋషులు సూక్ష్మస్థితిలో ప్రసారం చేసుకునే తమ అనుభవాలను, తాను కూడా వినాలని శివుడు వెలిసినట్టు ప్రతీతి. శివలింగం అంత చిన్నదిగా ఉన్నదేమిటని పిల్లలకు అనుమానం వచ్చింది. ఋషుల తపోనిష్టకు భంగం కలగకుండా శ్రవణేంద్రియాన్ని మాత్రం బయటకు పెట్టి ఉన్నందున .. అన్న జవాబుకు వారు సంతుష్టు లయ్యారు. అయితే శివుడే ఎందుకు వచ్చాడు, అక్కడున్న ఋషులంతా శివుడి గురించే తపస్సు చేస్తున్నారా అని మరో ప్రశ్న వచ్చింది. నిజానికి తపస్సు అన్నది శివయోగం. తపస్సు ద్వారా అన్ని కర్మలు కరిగిపోతాయి కాబట్టి జీవుడికి తపస్సు తప్పనిసరి. తపస్సు ద్వారా అన్ని కర్మలు కరిగిపోయిన జీవుడు శివయోగంలో సిద్ధి పొంది, శివైక్యం చెందుతాడు. అందుకని శివుడు. ఈ నేపథ్యంలో తపస్సు, క్షేత్రం, దైవం గురించి కాస్త తెలుసుకుందాం.
                                                           -------------
నిజానికి ఎవరూ తపస్సు చేయరు. చేయలేరు. తపస్సు అనేది దానంతట అది ఏర్పడుతుంది. అలా ఏర్పడాలంటే ఎవరైనా చేయాల్సింది జపం మాత్రమే. ఆధ్యాత్మికంగా మనం చేయగలిగింది జపం ఒక్కటే. ఆ జపమే ఏకాగ్రతగా, ధ్యానంగా, తపస్సుగా మారుతుంది. ఈ మారడంలో ఎవ్వరి ప్రమేయం ఉండదు. జప సాధకులకు శ్రీశైలం అద్భుత ప్రదేశం. ఏ ప్రదేశమైతే జప బలాన్ని తాను తీసుకోగలిగి, తన బలాన్ని జప సాధకులకు ఇవ్వగలుగుతుందో .. దాన్ని ‘క్షేత్రం’ అంటారు. అలాంటి క్షేత్రాన్ని దర్శించుకోవడం అంటే .. జప బలాన్ని ఇవ్వడం లేదా క్షేత్ర బలాన్ని తీసుకోవడం .. కోసం మాత్రమే. ఇది తెలుసుకుని చేసే తీర్థయాత్రలే పారమార్ధికమైనవి. అలా జపం క్రమంగా తపస్సుగా మారగల అవకాశం ఉన్న క్షేత్రం శ్రీశైలం కాబట్టి అది తపోభూమిగా ఖ్యాతి చెందింది. జీవుడు తానుగా క్షేత్రంతో మమేకమవడమే క్షేత్రదర్శనం. కొన్ని సందర్భాల్లో క్షేత్రమే తానుగా జీవుడిని రప్పించుకోవడం, జీవుడితో కదిలి వెళ్లడం జరుగుతుంది. ‘‘ ఆయన ఉన్న చోటు సాక్షాత్తూ క్షేత్రమే ’’ అని కొందరి గురించి అనుకోవడం మనం వింటూ ఉంటాం. యోగులకు క్షేత్రంతో ఇలాంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. వ్యాసుడు దక్షిణాన ద్రాక్షారామానికి, అగస్త్యుడు ద్రవిడ దేశానికి రావడం ఈ కోవలోవే. వ్యాసునితో కాశీ క్షేత్రం కదిలి వచ్చింది కాబట్టే ద్రాక్షారామం ‘దక్షిణ కాశీ’గా పేరు గాంచింది.
                                                         ------------
ఇకనుంచీ మనమంతా క్షేత్ర రహస్యం తెలుసుకుని క్షేత్ర దర్శనం చేసుకుందాం. భగవంతుని అనుగ్రహం పొందుదాం.